Wednesday, November 20, 2024

TG: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే… ఏ.వీ రంగనాథ్

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా.. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతోంది.

ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లైతే.. అలాగే ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, ఎస్పీకి, సీపీకి కానీ లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కానీ, తప్పుదోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగం పేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్…
ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా.విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న డా.విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement