కరీంనగర్ : తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్.. ఇక మీదట పోస్టాఫీసుల వద్ద వెయిట్ చేయకుండా ఇంటికి వచ్చి రైతు బంధు పైసలు ఇవ్వనున్నట్టు పోస్టల్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇవ్వాల కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఈ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పంట పెట్టుబడి కోసం అందిస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పోస్టాఫీసుల ద్వారా తమ ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఏ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నా.. రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా రోజుకు 10వేల చొప్పున తీసుకోవచ్చునని పేర్కొన్నారు.
రైతులు తమ పనులు మానుకొని నగదు కోసం దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఆగం కావద్దని పోస్టల్ డిపార్ట్‌మెంట్ తరపున ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యయ ప్రయాసలు పడకుండా గ్రామంలో ఉన్న పోస్టాఫీసు ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా ఇంటి వద్దనే సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ మైక్రో ఏటీఎం ద్వారా నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా తపాలా శాఖ గ్రామాలలోని పోస్టాఫీస్ ల ద్వారా అందిస్తున్న ఈ నగదు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు.