Thursday, January 23, 2025

MDK | అంచెలంచెలుగా సంక్షేమ పథకాలు అందిస్తాం.. మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, జనవరి23 (ఆంధ్రప్రభ) : అంచెలంచెలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని, ప్రతి పేదోనికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ మండల పరిధిలోని నేరేడుగుంట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు మంత్రి హాజరై మాట్లాడారు.

దశల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తామన్నారు. పింఛన్లు కూడా త్వరలో అందించబోతున్నామన్నారు. ప్రజలతో మమేకం కావడానికి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి ఇందిరమ్మ, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. నేరడిగుంట గ్రామానికి సంబంధించి 127 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని, దాని వెంటనే పూర్తి చేస్తామన్నారు.

నేరేడుగుంట గ్రామానికి మంత్రి వరాల జల్లు..
అందోల్ మండల పరిధిలోని నేరేడుగుంట గ్రామానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ వరాల జల్లు కురిపించారు. గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 5 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు, నీటి సమస్య, నేరేడుగుంట నుంచి బ్రాహ్మణపల్లి చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణం పనులు, ఇండ్ల పైనుంచి వెళ్లిన విద్యుత్ వైర్ల సమస్య వంటివి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు చప్పట్ల వర్షాన్ని కురిపిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఎవరూ ఆందోళన చెందకుండా అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఏడీఏ వసంత కుమారి, మెప్మా పీడీ గీత, ఆర్డీవో ఆర్.పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బి.శివరాజ్, నేరేడుగుంట మాజీ సర్పంచ్ చందులత వీర్ మల్లప్ప, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement