తాను విదేశాల్లో ఉన్నప్పటికీ తన ఇంటి తాళాలు పగలగొట్టించి మరీ ఈడీ అధికారులకు సహకరించానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన ఇంట్లోని ప్రతి లాకర్‌ని ఓపెన్ చేసి చూసుకోమని చెప్పానన్నారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అన్నారు మంత్రి గంగుల.
సోదాల్లో ఏంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబందించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. మరి బయట దేశాల్నుండి డబ్బులు హవాలా తెచ్చామా అనేది ఈడి, డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ చూస్తోందన్నారు. వీటికి సంబందించి తమ సంస్థల్లో ఎలాంటి లావాదేవీలు జరగలేదని, గతంలో సైతం చాలా సార్లు, చాలా మంది, ఈడీ, ఐటీలకు కంప్లైంట్ చేశారన్నారు. అయినా వారిని తాము స్వాగతించామని, పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు గంగుల. ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే వెంటనే వచ్చానని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్.