10మంది డాక్టర్లు, 20 మంది నర్సులతో వైద్య సేవలు
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 28(ఆంధ్రప్రభ): ముత్తారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో అస్వస్థతకు గురై పెద్దపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. విద్యార్థుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 10మంది డాక్టర్లు 20మంది నర్సులతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి కారణమైన విషయంపై ప్రాథమిక ధర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
వసతి గృహం పక్కనే ఉన్న డంప్ యార్డును అక్కడి నుండి తీసివేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.