Wednesday, September 18, 2024

TG: అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం.. రైతుల‌కు భ‌ట్టి భ‌రోసా

2029 కల్లా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన
వ్యవసాయ పంప్ సెట్ లకు సోలార్ పవర్
పత్తిపాక రిజర్వాయర్ కు నిధులు
పదివేల కోట్లతో రామగుండంలో విద్యుత్ ఉత్పాదన కేంద్రం
ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క


ధర్మారం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 15రోజుల్లో 18వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రెండు లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని అసత్యపు ప్రచారాలు చేశారని, అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

- Advertisement -

2029 కల్లా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి తీరుతామన్నారు. థర్మల్ పవర్ తో పాటు సోలార్, విండ్ పవర్ ఉత్పాదన చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన పరిశీలించేందుకు పరిచే విధంగా చేసి తీరుతామన్నారు. రామగుండంలో పదివేల కోట్ల రూపాయలతో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రైతులందరి వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా 30గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ ప్రభుత్వం ఖర్చుతో అందజేస్తామన్నారు.

రాష్ట్రంలోని రైతులు పంటతో పాటు కరెంటుతో ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు గ్రామాల్లోని ప్రజల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ అంశాన్ని బడ్జెట్ లో చేర్చామని, సర్వే పూర్తికాగానే నిధులు కేటాయిస్తామన్నారు. 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, జీరో కరెంట్ బిల్లు ప్రారంభించామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ దానం చేసిన త్యాగధనులందరికీ పరిహారం తప్పనిసరిగా అందిస్తామన్నారు. బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement