తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ లక్షలాదిమంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవ్వాల (ఆదివారం) ఆర్టీసీ కరీంనగర్ డిపో-2 లో నిర్వహించిన కరీంనగర్, ఖమ్మం రీజియన్ కు చెందిన ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని 45 మందికి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో డిసెంబర్ 9 నుండి మహిళలందరికీ బస్సులలో ఉచితంగా ప్రయాణంతో బస్సులన్ని కిక్కిరిసి ప్రయాణంతో ఆర్టీసీ పూర్వ వైభవం వచ్చిందని ప్రయాణికుల సౌకర్యం కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న కార్మికులందరికీ అభినందించారు. మహాలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి బస్సులు, ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు, కొత్త కొత్త రూట్స్ ఏర్పాటుచేసి ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడానికి వెయ్యి బస్సులను కొనుగోలు చేయడం, నూతనంగా 3వేల మంది ఉద్యోగుల నియమించేందుకు చర్యలు చేపట్టి అందరి సహకారంతో ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ప్రైవేట్ అద్దె బస్సులు భాగస్వాములైనందుకు వారికి అభినందనలు తెలిపారు. కార్మికుల చిన్న చిన్న సమస్యలకు మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీలోని 43 వేల మంది ఉద్యోగులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ లక్షలాదిమంది ప్రయాణికులకు కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని అన్నారు.
కొత్త బస్సులు, సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టను అంటూ తెలిపారు. ఆర్టీసీలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. ఆర్టీసీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలకు త్వరలో పరిష్కారం చేయనున్నట్లు, జనవరి 31న ఆర్టీసీ కార్మికులకు మంచి శుభవార్త తెలియజేయునన్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం 45 మందికీ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.రఘునందన్ రావు, ఈడి అడ్మిన్ ఎస్ కృష్ణ కాంత్, కరీంనగర్ ఆర్ఎం ఎన్. సూచరిత, డిప్యూటీ ఆర్ ఎం లు భూపతి రెడ్డి, సత్యనారాయణ, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ విలాస్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య సెక్యూరిటీ ఆఫీసర్ బాపూరావు డీవీఎంలు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు