ఇప్పటికే ఉప సంఘం వేశాం
విధి విధానాలు విడుదల చేస్తాం
కాడిపట్టిన రైతుకే భరోసా
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాదన్నారు. అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10వేల రూపాయలు మాత్రమే చెల్లించారన్నారు.. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారని ఆరోపించారు.
దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోందని వెల్లడించారు.. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిందని చెప్పారు. ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించిందన్నారు.
వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని రేవంత్ చెప్పారు. మన రాష్ట్రంలో వరిసాగు చాలా విస్తారంగా జరుగుతోందంటూ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించామని గుర్తు చేశారు. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించామన్నారు.
రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచామని, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని, నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందన్నారు రేవంత్.