వరంగల్ – పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను పట్టించుకోలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా.. ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందరూ ప్రభుత్వం గెలుపుకు కారణం అయినందుకు మీరందరికి చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా మీరు నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎంజీఎంకి వచ్చిన ప్రతి పేషెంట్ కి మీ వంతు సేవ తప్పనిసరి అవసరం ఉంటుందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. అదేవిధంగా కొంతమందికి నెలల జీతం ఆగిపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వరంగల్ జైలును కూలగొట్టి మల్టీ స్పెషాలిటీ కడతామని చాలా డబ్బు వృధా చేశారని మండిపడ్డారు. తద్వారా ప్రజలకు ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదని.. ఎవరైనా సరే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి అవి కూడా త్వరలోనే బయటకు తీస్తామన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.