Friday, November 22, 2024

TG: ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం… రేవంత్

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నారు .. అయినా కోర్టుల్లో కొట్లాడుతాం
అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చేస్తాం
ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఉప్పెన‌లా వ‌ర‌ద‌లు
జ‌నాల‌ను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు
పేద‌ల‌ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థం ఉంది
స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ ​రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్​ అన్నారు. బుధ‌వారం పోలీసు అకాడ‌మీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన సీఎం.. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని చెప్పారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.

కోర్టుల్లో కొట్లాడ‌తాం..

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, ఆ కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11 వేల మంది బాధితులకు 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -

కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా చేరిన వారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వ్యసనాలకు స్థానం ఉండకుండా చేయాలన్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement