Friday, November 22, 2024

TS: హామీలపై ఊరూరా ఎండగడతాం, నిరసనలు సాగిస్తాం… కేటీఆర్

పార్టీని రాష్ట్రాన్ని రైతులను కాపాడుకుంటాం
సీఎం మొగోడివైతే ఇచ్చిన హామీలు అమలు చేయాలి
హామీలు అమలైన వారు కాంగ్రెస్కే ఓటేయండి.. రాని వారంతా బీఆర్ఎస్ కే ఓటు వేయాలి
హైదరాబాదులో ప్రారంభమైన తాగునీటి కటకట.. రేపు పల్లెల వరకు పా
నేతన్నల కోసం ఊరు రా దీక్షలు చేపడుతాం
సిరిసిల్ల ‘ రైతు దీక్ష ‘ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 6 (ప్రభన్యూస్) : దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలని, పార్టీని, రాష్ట్రాన్ని, రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులoదరిపై ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు. శనివారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో నిర్వహించిన ‘ రైతు దీక్ష’ లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన ఈ దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, నెలకొన్న గడ్డు పరిస్థితి పై నాలుగు నెలల్లోనే మాట్లాడుకునే అవసరం రావడం బాధాకరమన్నారు. ఏడు పదుల వయస్సులో కేసీఆర్ మండు టెండల్లో జనగామ, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, సిరిసిల్ల మొదలైన ఐదు జిల్లాలలో స్వయంగా పర్యటించి రైతులకు ధైర్యం ఇచ్చారన్నారు. ఈ స్థితిలో ఎక్కడికక్కడ గులాబీ దండు ప్రతి నియోజకవర్గంలో దీక్షలకు పూనుకున్నదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రూ.500 బోనస్ పై స్పష్టత నివ్వాలని, కుంటి సాకులు చెప్పవద్దని, జీవో తీసి అమలు చేయాల్సి ఉండేదని, ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాసి అమలు చేయాలన్నారు. మీరు రైతుబంధు ఆపినట్టుగా తాము బోనస్ ను ఆపమని, ప్రస్తుతం రాళ్లవాన ఎండిన పంటలతో నష్టం జరిగిందని, రైతులకు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఈసీకి చెప్పి అనుమతి పొందాలన్నారు. తాము దీనిపై వ్యతిరేకించబోమన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకుంటే ప్రతి కల్లా వద్ద రైతులు ఇచ్చిన ధాన్యంపై లెక్కలు వేసి ఎన్నికలు అయిన తెల్లారే బోనస్ రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. కరువుపై సీఎం, మంత్రులు తెలివి ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పోయిన ఏడాది 14శాతం సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం పడిందని, పంటలు మునిగితే ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు సైతం మంథనిలో ఇంటింటికి తిరిగి పంట నష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు.

- Advertisement -

తాము అధికారం నుండి పోయే రోజు 7 వేల కోట్ల రైతుబంధుకు నిధులు జమ చేసి, నిండు ఖజానాను నింపి పోయామన్నారు. అయితే కేసిఆర్ ను బదునాం చేయాలని ప్రజలు తిట్టిపోయాలని వంటలు ఎండిపోవాలని, పంటలు ఎండితే కొనే పరిస్థితి తప్పుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ రాజకీయ కుట్ర చేసిందన్నారు. ఈ ప్రచారాన్ని కుక్కల లాగా ఒర్రుతున్నారని, యూట్యూబ్లలో ప్రచారం చేస్తున్నారని, మేడిగడ్డ వద్ద నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి పంటలను ఎండబెట్టారని, రాజకీయంగా మనుగడ సాధించడం కోసం లక్ష మంది రైతుల పొట్టలు కొట్టారని కేటీఆర్ దుయ్యబట్టారు. రెండు నెలలు పనిచేసి వంగిన పిల్లర్లను సరి చేస్తే 48 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చి ఎకరం కూడా ఎండిపోని పరిస్థితి ఉండేదన్నారు. రాజకీయంగా చిల్లర పనులు చేయకూడదని, 110 రోజులు ఓపిక పట్టామన్నారు. 420 హామీలు ఇచ్చి, మహిళలకు ఇస్తామన్న తులం బంగారం, స్కూటీలు, రెండు లక్షల రుణమాఫీ, బోనస్ అటే పోయాయ‌న్నారు. డిసెంబర్ 9 అని చెప్పి రెండు రోజుల ముందే తన కుర్చీ ఎవరో ఎత్తుకెల్లుతారనే భయంతో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇస్తుంటే దానిని సీరియస్ గా తీసుకోవద్దని సీఎం అంటున్నాడని, రైతులు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

రైతులు పండించిన అన్ని పంటలు కొంటామని ఎకరానికి అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని, కౌలు రైతుకు రైతు భరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామన్నాడని అయితే తాము ఇస్తామన్న 10 వేలకు కూడా ఇచ్చే దిక్కు లేదన్నారు. వీటిని అమలు చేయకుంటే రైతుల పక్షాన గొంతు విప్పుతామని, గొంతు విప్పకుంటే రైతులు సంతోషంగా ఉన్నారనే వాదన కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తుందన్నారు. రెండు లక్షల రుణమాఫీ రూ.500 బోనస్, కౌలు రైతులకు భరోసా, 24 గంటల కరెంటు అందుకున్న వారు కాంగ్రెస్ కు ఓటే వేయవచ్చని, మిగిలిన వారందరూ తమకు ఓటు వేయాలని, వంద రోజుల పాలన ను రెఫరెండంగా రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. నాగార్జున సాగర్ లో కూడా నీరు ఇవ్వక పంటలు ఎండబెట్టారన్నారని, మిషన్ భగీరథ నడుపుకునే తెలివి లేదని, హైదరాబాదులో తాగునీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మారుమూల పల్లెల్లో కూడా తాగునీటికి కటకట రాబోతున్నదని, వండిన అన్నం కూడా వడ్డించే తెలివి కాంగ్రెస్ కు లేదని అందుకే కాలేశ్వరం వాడుకునే తెలివి లేకుండా పోయిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రేపటి నుండి తాము ప్రతి కొనుగోలు కేంద్రం వద్దకు రైతులను కూడగట్టుకొని వెళతామని వెల్లడించారు. అడగకుండానే 420 హామీలు ఇచ్చారని, ఒక్కో హామీని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎండగడతామన్నారు.

ప్రజల్ని జాగరూకత చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు, ఓట్ల కోసం మాట్లాడే అవసరం మనకు లేదని, మనం ప్రభుత్వాన్ని కూలగొడుతామని సీఎం ఆగం అవుతున్నాడని, జేబులో కత్తెర పెట్టుకొని పొడిచి పేగులు మెడలో వేసుకుంటానని సీఎం అంటున్నాడని, జ్ఞానమున్న సీఎం అలా అంటాడా అని ప్రశ్నించాడు. మెడలో పేగులు వేసుకొని జేబులో కత్తెర తీసి బోటి కొడతాడ అని ఎద్దేవా చేశారు. కత్తెరలను జేబులో పెట్టుకొని తిరిగే వారిని జేబు దొంగలు అంటారని చలోక్తి విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మొగోడు అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రూ.500 బోనస్ ఇవ్వాలని, మహాలక్ష్మి కింద రూ. 2500 సాయం మహిళలకు అందించాలని దీనికోసం కోటి 60 లక్షల మంది ఎదురుచూస్తున్నారని, రూ.4 వేల పెన్షన్ కోసం వృద్ధులు ఎదురుచూస్తున్నారని మొగోడివైతే వీటన్నింటినీ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మనం రైతుల కోసం ఇక్కడ కొట్లాడుతుంటే సీఎం క్రికెట్ చూస్తూ ఆనందిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆదాయం ఎలా తేవాలో, ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన ఎలా చేయాలో సీఎంకు తెలవదన్నారు. మందికి పుట్టిన బిడ్డలను తన బిడ్డలుగా చెప్పుకున్నట్టు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల తో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తాను ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడని, ఇకనుండి ఈ మోసాలు నడవబోవన్నారు. 30 వేల ఉద్యోగాలు తీసివేసి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతన్న, నేతన్నలతో పాటు ఏ రంగం కూడా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేదన్నారు. నేతన్నల కోసం సిరిసిల్లతో పాటు పోచంపల్లి, గద్వాల, దుబ్బాక మొదలైన ప్రతి చోట దీక్షలు చేపడుతామన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన బిజెపికి రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే నైతికత లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇకనుంచి తమ ఆందోళన ఆగదని, ప్రతి చోట ఫ్లెక్సీలు కడతామని, ధర్నాలు, రాస్తారోకోలు వంటా వార్పులు చేస్తామని వెల్లడించారు. పంట నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తామని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. దీక్షలు, ధర్నాల వద్ద గులాబీ, ఆకుపచ్చ కండువాలతో పాల్గొనాలని ఇందు కోసం అందరూ కలిసి రావాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ రైతు దీక్షలో నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందo చక్రపాణి, దరువు ఎల్లన్న, పులి శ్రీకాంత్, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement