హైదరాబాద్, ఆంధ్రప్రభ : దళిత వర్గానికి చెందిన జర్నలిస్టులకు దళిత బంధు పథకాన్ని వర్తింప చేస్తామని, నియోజక వర్గాల్లో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మీడియా అకాడమీ, ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని దళిత వర్గాలకు చెందిన జర్నలిస్టులకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులను మంత్రి కొప్పుల ప్రారంభించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకుని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. దళిత రక్షణ నిధి కింద ప్రభుత్వం రూ. 3,400 కోట్లు కేటాయించిందన్నారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. 1996లో బీఎస్పీ నేత కాన్షీరామ్ను ఇంటర్వ్యూ చేయడానికి దళిత జర్నలిస్టులు ఉన్నారా..? అని అడిగితే ఢిల్లిలో 700 మంది జర్నలిస్టుల్లో ఒకరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు లేరని తేలిందన్నారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది దళిత వర్గానికి చెందిన జర్నలిస్టులు రావడం హర్షనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, చంటి క్రాంతి కిరణ్, దుర్గం చిన్నయ్య, కిషోర్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఐఆర్పీఆర్ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : ఎంజేఎఫ్ వినతి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వర్గానికి చెందిన జర్నలిస్టులను ప్రభుత్వం పరిష్కంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంజేఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా వినతిపత్రాలు అందజేశారు. దళిత బంధు, ఎస్సీ కార్పోరేషన్ రుణాలు, ఇళ్ల స్థలాలు, మూడ్ బెడ్రూంల ఇళ్లతో పాటు 16 సమస్యలను పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంజేఎఫ్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మాతాంగి దాసు, సుంచు అశోక్, ప్రధాన కార్యదర్శి మంద జనార్దన్, కోశాధికారి సాయి రమేష్, యాతాకుల అశోక్, నాయకులు ఎర్ర యాకయ్య, డప్పు రామస్వామి, రవీందర్ తదితరులున్నారు.