Sunday, November 17, 2024

TS: ఒక‌సారి మోస పోయాం.. మ‌రోసారి మోస‌పోదామా.. ఓట‌ర్లను ప్ర‌శ్నించిన కేటీఆర్

కాంగ్రెస్ స‌ర్కారు అప్పుడు, ఇప్పుడు కూడా మోస‌మే చేసింది
అన్నింటిని వాయిదాలు వేస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్
ఇక మ‌త విద్వేషాల‌తో బిజెపి రెచ్చ‌గొడుతున్న‌ది
తెలంగాణ‌కు ఏమీ ఇవ్వ‌ని మోదీ మ‌న‌క‌వ‌స‌ర‌మా..
ఆడ‌ప‌డుచులు విజ్ఞ‌త‌తో ఆలోచించండి…
బిఆర్ఎస్ కు ఆండ‌గా నిల‌బ‌డండి..
చేవేళ్ల బిఆర్ఎస్ ర్యాలీలో కేటీఆర్

చేవేళ్ల – అర‌చేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి అంద‌రినీ మోసం చేసిందంటూ దుయ్య‌బ‌ట్టారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్‌స‌భ ఎన్నిక‌లు రాగానే ఆగ‌స్టు 15 వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని మ‌ళ్లీ మోసం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. నేడు జ‌రిగిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ ర్యాలీలో పాల్గొన్నారు.. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ…. ప్ర‌జ‌లు ఒక‌సారి మోస‌పోతే అది నాయ‌కుల త‌ప్పు అవుతుంద‌ని, .. రెండోసారి కూడా మోస‌పోతే అది వంద‌కు వంద‌శాతం ప్ర‌జ‌ల‌దే త‌ప్పు అవుతుంద‌న్నారు. అందుకే రెండోసారి మోస‌పోదామా అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాల‌న్నారు కేటీఆర్. ఆడబిడ్డలు ఆలోచించాలి మోడీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారు మోదీ అంటూ వివ‌రించారు. 70 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుకా ? డీజీల్ రేట్లు పెంచినందుకా ? సిలిండర్ రేట్లు పెంచినందుకా ? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా ? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి ? అంటూ ఓట‌ర్ల‌ను ప్ర‌శ్నించారు. ఇక బీజేపీ ఎంపి బండి సంజయ్ మాత్రం మోదీ దేవుడు అని అంటార‌ని, ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడ‌న్నారు.

- Advertisement -

మ‌త రాజ‌కీయాలు చేస్తున్న కాషాయం పార్టీకి ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల‌లో ఓటు ద్వారా త‌గిన బుద్ధి చెప్పాల‌న్నారు. ప‌దేళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్ప‌కుండా కేవ‌లం జైశ్రీరామ్ అంటోంద‌ని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాద‌న్నారు. రాముడు అంద‌రివాడు అని పేర్కొన్నారు.

మోడీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు..200 ల సీట్లు కూడా వచ్చేలా లేవ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు కేటీఆర్. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్ కు మంచి సీట్లు రావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటుంద‌న్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పాల్సిందేన‌న్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన రోజు వ‌చ్చింద‌ని చెప్పారు..

111 జీఓ గురించి అన్ని పార్టీలు మాట్లాడాయ‌ని, కానీ దాన్ని ఎత్తివేసిన ఘ‌న‌త మాత్రం కేసీఆర్‌దేన‌ని గుర్తు చేశారు. కాసాని బ‌ల‌హీన వ‌ర్గాల బాహుబ‌లి అని, ఎస్‌సీలు, ఎస్‌టీలు, బీసీలు ఏక‌మై ఆయ‌న‌ను గెలిపించాల‌ని కోరారు. అలాగే ఒక‌వైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వ 100 రోజుల అబ‌ద్ధం ఉంటే, మ‌రోవైపు బీఆర్ఎస్ ప‌దేల్ల పాల‌న ఫ‌లాలు మీ ముందు ఉన్నాయ‌న్నారు. అందుకే ఆలోచించి ఓటు వేసి స‌రైన నాయ‌కుడిని ఎన్నుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement