క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం
నిర్విరామంగా పని చేస్తున్నది..
తాము ప్రజల మధ్యలో ఉంటే..
కేటీఆర్, హరీశ్ రావులు సోషల్ మీడియాకే పరిమితం
బీఆర్ఎస్ నిర్వాకంతోనే ముంపులో హైదరాబాద్
ఖమ్మం… వరదలు, వర్షాలతో తెలంగాణ ప్రజలు ఇక్కట్లు పడుతుంటే సహాయక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్, హరీష్ రావులు పరిమితమయ్యారని విమర్శించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఖమ్మం, మధిర ప్రాంతాల్లోని వరద ప్రాంతాలను ఆయన పర్యటించారు.. బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..
అనంతరం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ… వరదలు రాగానే ప్రజల్లోనే వున్నామని, సహాయ చర్యలను అందించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ప్రభుత్వం కీలకంగా పనిచేసిందని, గతంలో చిన్న వర్షం వస్తే హైదరాబాద్ లో బీఆర్‌ఎస్ చేతులు ఎత్తేసే వారని ఆయన అన్నారు.
ఇప్పుడు హైదరబాద్ ను అద్భుతంగా తయారు చేస్తున్నామని, నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ప్రజల వద్దకు వస్తే ప్రజలు తిరగబడతారని అదే సోషల్ మీడియాలో అయితే ఏదైనా చెప్పే అవకాశం ఉండటంతో వారు సోషల్ మీడియాకే పరిమితం అయ్యారని విమర్శించారు. అధికారులు కూడా మనుషులే అని రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి అభినందిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మర్చిపోయారని, తమది గడీల పాలన కాదని, మేము గడీలకు పరిమితం కాలేదన్నారు భట్టి.