- ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు… విద్యార్థుల ధర్నా
- గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల నిరసన వ్యక్తం
- ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన బాలికలు
- ప్రిన్సిపాల్ ని వెంటనే మార్చాలంటూ డిమాండ్
- ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు
జోగిపేట, డిసెంబర్21 (ఆంధ్రప్రభ) : సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే మార్చాలని.. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం ఉదయం గురుకుల పాఠశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రెండు గంటలకు పైగా అక్కడే బైఠాయించి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులకు నచ్చజెప్పినప్పటికీ ప్రిన్సిపాల్ బయటికి వెళ్ళితేనే తాము లోపటికి వస్తామంటూ అక్కడే గేటు ముందు కూర్చొని నిరసన తెలిపారు.
ఈ సంఘటన తెలుసుకున్న అందోల్ ఆర్డీవో ఆర్.పాండు, తహసీల్దార్ విష్ణుసాగర్, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్ రెడ్డి, సీఐ అనిల్ కుమార్ అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ మాతో రోజూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని, కారును కూడా కడిగించుకుంటుందని, బట్టలు కూడా తమతో శుభ్రం చేయించుకుంటున్నారని, టీచర్లను కూడా బూతు మాటలతో తిడుతున్నారని, ప్రిన్సిపాల్ ఇక్కడే ఉంటే గురుకులంలో మేము చదువుకోలేమని విద్యార్థులు తేల్చి చెప్పారు.
ప్రిన్సిపాల్ ని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు గేటు బయట నుంచి లోపలికి వచ్చారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ తీరుపై విచారణ చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టర్ ఆదేశాలతో గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థంకాక రోడ్డుపైకి వచ్చామని విద్యార్థులు అదనపు కలెక్టర్ తో అన్నారు. తమకు అండగా ఉండే టీచర్లను వేధించడమే కాకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని, ఇటీవల ప్రిన్సిపాల్ వేధింపులకు పిఈటి స్వాతి టీచర్ లెటర్ రాసి వెళ్లిపోయిందని, ఇలా ప్రిన్సిపాల్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులందరినీ వేధిస్తున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. విచారణ చేపట్టి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.