Tuesday, November 19, 2024

భద్రాద్రి ప్లాంటు పరికరాలు బీహెచ్‌ఈఎల్‌ వద్దే కొన్నాం.. అవినీతి పైసలు మోడీ తీసుకున్నారా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాత్రి విమానంలో తిరిగితే ఎన్ని రాష్ట్రాల్లో కరెంటు ఉందో లేదో బండి సంజయ్‌కి తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కౌంటరిచ్చారు. నేలమీద తిరిగితే విద్యుత్‌ ఉందో లేదో కనిపించదన్నారు. రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌తో కలిసి పువ్వాడ మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 7 వేల మెగావాట్లున్న విద్యుత్‌ ఉత్పత్తిని ఏకంగా 24 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని బట్టి అప్పులు వస్తాయని, కేంద్రం కావాలనే అప్పులకు అడ్డుపడుతుందన్నారు. కేంద్రప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో 100 లక్షల కోట్ల అప్పును ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీతాలకు అప్పులకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర ఆదాయంతోనే జీతాలు, పథకాలు నడుస్తాయన్నారు. కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టుకోవడానికేనని స్పష్టం చేశారు. భద్రాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు విన్నతర్వాత బాధేసిందని ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. భద్రాద్రికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఇచ్చిన యంత్రాలే వాడిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.

బండి కేంద్రంపై ఆరోపణలుచేసి తనపైతానే ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. సంజయ్‌ మాటలు తుగ్లక్‌ మాటలకంటే దారుణంగా ఉన్నాయన్నారు. కరెంటు కొనుగోలుకు జెన్‌కోలు 20 రూపాయలు ఛార్జ్‌ చేస్తున్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, ఈ నెలలో కూడా 6 రూపాయల నుంచి 12 రూపాయలు పెట్టి కొనవచ్చని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందన్నారు. ఎన్‌టీపీసీకి 7 రూపాయలు ఇచ్చి కరెంటు కొంటున్నామని, అంటే ఎన్‌టీపీసీకి కేసీఆర్‌ పైసలిస్తున్నట్లా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ లేకపోతే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నట్లే కరెంటు తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో అన్నిరాష్ట్రాలు అప్పులు తీసుకుంటున్నాయని, కానీ అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణేనన్నారు. కేంద్రమే ఎఫ్‌ఆర్బీఎమ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement