Thursday, November 21, 2024

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూనే… స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నాం : మంత్రి త‌ల‌సాని

నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈరోజు సనత్ నగర్ లో రూ.1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా సుందర్ నగర్ కాలనీ పార్క్ లో రూ.13.20 లక్షలతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ప్లే పార్క్, ఓపెన్ జిమ్ లు, సుభాష్ నగర్ లో రూ.46.90 లక్షల వ్యయంతో (జి ప్లస్ 1) నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్, సనత్ నగర్ బస్ స్టాప్ వద్ద రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యునిటీ హాల్ (జి ప్లస్ 1), జిమ్ లను స్థానిక కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… గతంలో ఈ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహించిన నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చేవారని, తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని గుర్తుచేశారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 7 సంవత్సరాలలో జరిగిందని వివరించారు. రోడ్లు, డ్రైనేజి, మంచినీటి పైప్ లైన్, సీవరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు, పార్క్ ల అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి పనులను కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజల అవసరాల కోసమే కమ్యూనిటీ హాల్స్ ను నిర్మించడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలనీకి చెందిన ప్రజలు చిన్న చిన్న వేడుకలు, సమావేశాల కోసం కమ్యూనిటీ హాల్స్ ను ఉపయోగించుకోవాలన్నారు. సనత్ నగర్ బస్టాప్ వద్ద ప్రారంభించిన జిమ్ లో ఇంకా కొన్ని పరికరాలు కావాలని స్థానికులు కోరగా, 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ వంశీ, డీఈ మోహన్, ఈఈ ఇందిర, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, ఏఎంఓహెచ్ భార్గవ్, నాయకులు కొలన్ బాల్ రెడ్డి, సురేష్ గౌడ్, సరాఫ్ సంతోష్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement