తాము పాలకులం కాదు సేవకులమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని మల్లేపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ డిజైన్ ను రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిజైన్ గురించి సీఎంకు అధికారులు వివరించారు. అదేవిధంగా పలు సాంకేతిక పరికరాలను కూడా సీఎం పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రమే చూడరని పేర్కొన్నారు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే ప్రయోజనం లేదన్నారు.
కాగా,
ఐటీఐల రూపు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఏటా రాష్ట్రంలోని ఐటీఐల నుంచి 1.5 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే.. ఈ విద్యను మరింత మెరుగుపర్చి, శిక్షణ పొందేవారి సంఖ్య డబుల్ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించారు. అందులో భాగంగా టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అప్‌గ్రేడ్ చేసేందుకు రెడీ..
ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను (ITI) ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలు (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్)గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేండ్లకుగానూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ.2,324 కోట్ల నిధులను కేటాయించింది.
= 65 ఐటీఐలను ఏటీసీలు (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్)గా అప్‌గ్రేడ్ చేస్తారు.
= ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు.
= శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ (టాటా టెక్నాలజీస్ లిమిటెడ్) నియమించనుంది.
= ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.
= పదేండ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేండ్లలో 4 లక్షల మంది శిక్షణ అందిచనున్నారు.
= ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం ₹2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా ₹2016.25 కోట్లు (86.74 శాతం)
= ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి.
= అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు టెక్నాలజీ హబ్‌గా పని చేస్తాయి.
= ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
= ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయి.