కేసీఆర్ భయపెట్టే ధోరణిలో మాట్లాడారని, నాలుకలు చీరేస్తామన్నారని, మీరు భయపెడితే భయపడే స్థితిలో బీజేపీ లేదని, తాటాకు చప్పుళ్లకు మేం బెదరం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మీరు భయపెడితే బీజేపీ కార్యకర్తలు, కేంద్రం భయపడదన్నారు. మీ తాటాకు చప్పుళ్లతో సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ సమస్యను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. 2014లో 43లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేదన్నారు. ప్రస్తుతం 94లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తున్నామన్నారు.
2014లో బియ్యం సేకరణ కోసం రూ.3,404 కోట్లు ఖర్చు చేశారని, 2021లో రూ.26,641 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మరి కేంద్రం పనిచేస్తుందా.. లేదా అన్నారని, ధాన్యం సేకరణలో 100శాతం కేంద్రమే ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. పంజాబ్ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బియ్యం కొనుగోలు చేస్తోందన్నారు. ప్రజలను, రైతులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. సమస్య మొత్తం దొడ్డు బియ్యం గురించేనన్నారు. తెలంగాణలో ఎవరూ తినరని, కేరళలో కూడా తగ్గించారన్నారు. రైతులు బాయిల్డ్ రైస్ పండించరన్నారు. రైస్ మిల్లుల్లో దాన్ని బాయిల్డ్ రైస్ గా మార్చుతారన్నారు. మిల్లుల్లో ఎక్విప్ మెంట్ మార్చి రా రైస్ ఇవ్వమని కోరామన్నారు.