తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు. రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతున్నదని, కేసీఆర్ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాలని సూచించారు. ఇక ఏపీ సీఎం జగన్, సీఎం కేసీఆర్‌కు మంచి మిత్రుడైనందున ఆయనను కూడా కలుపుకొని పోవాలని సూచించారు.