Friday, January 24, 2025

NZB | సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం..

  • సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉపాధ్యాయ దంపతుల క్షీరాభిషేకం
  • 834 స్పౌజ్ బదిలీల పట్ల ఉపాధ్యాయుల హర్షం


నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 23 (ఆంధ్రప్రభ) : స్పౌజ్ బదిలీలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 2021లో వెలువడిన 317 జీవో ద్వారా ఉపాధ్యాయ దంపతులను వేర్వేరు జిల్లాకు బదిలీలయ్యారు. గత మూడు సంవత్సరాలుగా భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎంతో ఆవేదనకు, మానసికంగా ఆందోళనకు గురయ్యారు. గత ప్రభుత్వంలో అనేక ఆందోళనలు జరిపినప్పటికీ ఆ ప్రభుత్వం ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయింది.

నూతనంగా కొలువుదీరిన‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీవో నెంబర్ 243 ద్వారా విడిపోయిన భార్యభర్తలను ఒక దగ్గరకు చేర్చింది. దీనిలో భాగంగానే పాఠశాల విద్యా శాఖలో 834 స్పౌజ్ బదిలీలను చేపట్టింది. నిజామాబాద్ జిల్లాకు 57మంది ఉపాధ్యాయులు స్పౌజ్ బదిలీల ద్వారా రావడం జరిగింది. ఈ స్పౌజ్ బదిలీల ద్వారా తమ కుటుంబాలను కలిపిన సీఎం రేవంత్ రెడ్డికి, 317- మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహకి, సబ్ కమిటీ సభ్యులు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుకి, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం…
ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టిన నేపథ్యంలో గురువారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉపా ధ్యాయులు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ మేలుకి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. వివిధ కారణాలతో మిగిలినటు వంటి అప్ గ్రేడేషన్ అయిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మిగిలిన స్కూల్ అసిస్టెంట్లు, ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ సెంట్రల్ స్పౌజ్ లాంటి వారి విషయంలో కూడా మానవతా దృక్పథంతో సానుకూల నిర్ణయం తీసుకొని దయచేసి సాధ్యమైనంత తొందరగా వారిని కూడా బదిలీ చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పౌజ్ ఫోరం కోకన్వీనర్ సోమయ్యగారీ నరేష్, బాలరాజు, రాజు, సుమన్, సుధాకర్ రాజేశ్వరి, సౌజన్య భారతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement