Thursday, November 21, 2024

ప్రజల కష్టాల్లో మేమున్నాం.. వరద ప్రాంతాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు భరోసా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాలో ఉండి కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాల్లో నేనున్నానంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో అతి భారీ వర్షం కురుస్తుంది. బాల్కొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్ మండలం తన స్వగృహంలో ఉంటూ ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గత పాలనలో మంత్రులంటే హైదరాబాద్ పట్టణంలో ఉంటూ ఆదేశాలు జారీ చేస్తూ సహాయక చర్యలు చేపడుతూ ఉండేవారు.

ప్రశాంత్ రెడ్డి మనసున్న మహారాజుగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకొని ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గురువారం ఉదయమే బాల్కొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. పలు గ్రామాల్లో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేమని వైపరీత్యాలకు జరిగే నష్టాలు మాత్రం ముందస్తుగా చర్యలు చేపట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ప్రజలకు వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తానున్నానని ఈ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లు, చెరువులు మరమ్మత్తులను వెంటనే చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

వరద తీవ్రతతో పంటలు నష్టపోయిన పంట పొలాలు సర్వే జరిపి వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు అయితేనే బయటకు రావాలని, లేకపోతే తమ ఇళ్ల వద్ద ఉండాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు సమాచారం ఇస్తే అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారన్నారు. నిండు వర్షంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పలుచోట్ల క్షేత్రస్థాయి పరిశీలన జరపడం రాజకీయ నాయకులకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. తామెప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో వర్షం పడటం తమ ప్రాంతంలో చూడలేదని ప్రజలు సైతం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారం యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నారని, పోలీస్, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement