Saturday, September 21, 2024

Warns – ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు – ఆర్టీసీ ఎండి సజ్జనర్

పోలీస్ శాఖ స‌హ‌కారంతో నిందితుల‌పై రౌడీషీట్స్
దాడికి గురైన డ్రైవ‌ర్‌ను పరామర్శించిన సజ్జనర్

హైదరాబాద్ – త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే తీవ్ర‌మైన క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రించారు. నిందితుల‌పై పోలీస్ శాఖ స‌హ‌కారంతో రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవ‌ర్ దార‌వ‌త్ గ‌ణేష్‌ను స‌జ్జ‌న‌ర్ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. డ్రైవ‌ర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

కాగా, అప్జ‌ల్ గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌కు వెళ్తున్న రూట్ నంబ‌ర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సులో విధులు నిర్వ‌ర్తిస్తోన్న డ్రైవ‌ర్ గ‌ణేష్‌పై దుండ‌గులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు. ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ ఆరుగురు తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గ‌ణేష్ కు తీవ్ర గాయ‌ల‌వ‌డంతో డ్రైవ‌ర్ అప‌స్మార‌క స్థిత‌లోకి వెళ్లిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీ వై జంక్ష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిందీ ఘ‌ట‌న‌.

- Advertisement -

ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, బైక్‌ల‌పై వ‌చ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని టీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ ఉస్మానియా యూనివ‌ర్శిటీ పోలీసులు వెంట‌నే స్పందించార‌ని చెప్పారు. దుండ‌గుల‌పై బీఎన్ఎస్‌లోని 109, 132, 352, 351(2), r/w 3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. ఐదుగురు దుండ‌గుల‌ను నేడు అరెస్ట్ చేశారని తెలిపారు.

ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  డ్రైవ‌ర్‌ను ప‌రామర్శించిన వారిలో జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ రావు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎం ఖుష్రోషా ఖాన్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement