గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నింటినీ ఆపేస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో నేడు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రెవిన్యూ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని భూమి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.తెలంగాణ ప్రజల కష్టపలితంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ళ స్థలం, ఇళ్ళు ఇచ్చే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి అన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇళ్ళపై నుంచి వెళ్లిన హై టెన్షన్ విద్యుత్ లైన్లను కూడా రెండు నెలల్లో మార్పిస్తామని చెప్పారు. వర్షాకాలం సాగుకు చివరి భూముల వరకు నీళ్లు వచ్చే విధంగా అధికారులు చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.