Friday, November 22, 2024

Warns – డిప్యూటేషన్, బదిలీలకు ఎంత దండుకున్నావో లెక్క‌లు తీయాలా….క‌విత‌ను ప్ర‌శ్నించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అసెంబ్లీ అవ‌ర‌ణ‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్‌ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు.

సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్‌ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేద‌ని.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement