హైదరాబాద్ – తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తే ఏమాత్రం సహించబోమని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు.
కాగా, లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు.
చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు సహకరించాలని, తెలంగాణ పోలీసుల ప్రతిష్టను, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని డీజీపీ కోరారు.
కఠిన చర్యలు తీసుకోండి… రేవంత్
ఎట్టి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . రాజకీయ కుట్రలను ఏమాత్రం సహించేది లేదని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.