Friday, November 22, 2024

గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై మోయలేని భారం ..

  • సీపీఐ జిల్లా కార్యదర్శి బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి
  • కాళోజీ సెంటర్ లో సిపిఐ రాస్తారోకో

హనుమకొండ : గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కాళోజీ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర 340 రూపాయలు ఉన్న ధర నేడు కేంద్ర ప్రభుత్వం పెంచడంతో 1125 రూపాయలు చేరిందని, రూ.1200 చెల్లించే స్థితికి రావడం కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు నిదర్శనం అన్నారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజులలో నిత్యాసరాల ధరలు నియంత్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పలు బహిరంగ సభల్లో తెలపడంతో ప్రజలు సంతోషపడ్డారని, కానీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెంచుతూ ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ శక్తులకు ఆర్థిక విధానాలను అనుకూలంగా మలిచి ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ఉండడంతో రెండు పూటలా భోజనం చేయలేని స్థితి నెలకొందని, కోట్లాది మంది దారిద్రంతో జీవనం కొనసాగిస్తున్నా బీజేపీ ప్రభుత్వం ధరలను తగ్గించక నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో గత పాలకులకు పట్టిన గతి బీజేపీకి పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా సమితి సభ్యులు జక్కు రాజు గౌడ్, కొట్టెపాక రవి, మాలోతు శంకర్, రాస మల్లదీనా, కండె నరసయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సంతోష్, రవితేజ, యువజన జిల్లా కన్వీనర్ ప్రశాంత్ యాదవ్, కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement