ఎడతెరిపి లేని వర్షాలు ఇబ్బంది పడుతున్న జనం…
అధికారుల అప్రమత్తం పోలీస్ శాఖ సేవలు…
ప్రభ న్యూస్, జనగామ : జనగామ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనగామ జిల్లాలో శనివారం నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జనగామ-హుస్నాబాద్ వెళ్లే రహదారి ధ్వంసమైంది.
లింగాల ఘనపూర్ మండల్ లోని పటేల్ గూడెం వద్ద జనగామ-పాలకుర్తి రహదారి బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన పనులు రోడ్ డైవర్షన్ వరదనీటికి కొట్టుకుపోయింది. దేవరుప్పుల మండలంలో ముత్తడి ఉధృతి, రఘునాథపల్లి మండల కేంద్రంలో జనగామ-వరంగల్ జాతీయ రహదారిపై వర్షానికి భారీగా వరద నీరు హైవేపై చేరడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు మండలాల్లో సైతం నీటి వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఇబ్బందులు ఏర్పడుతున్న ప్రాంతంలో అధికారులు పోలీస్ శాఖ అప్రమత్తమై విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.