ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలకు సై
మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
డివిజన్ల వారీగా రెడీ అవుతున్న ఇన్‌ఛార్జిల లిస్ట్
కార్పోరేషన్‌ల తర్వాత ఐదు మునిసిపాలిటీలు,
మండల పరిషత్‌లకు ఎన్నికల నిర్వహించే యోచన
హైదరాబాద్, : కార్పోరేషన్ ఎన్నికల నగారా.. మోగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు, నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగిం చేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలతో కూడిన నియోజక వర్గాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ అదే ఊపుతో ఇటు సాగర్ ఎన్నికకు, అటు కార్పోరేషన్ ఎన్నికలకు రెడీ అయింది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతుండగా, ఈనెల 17న పోలింగ్ జరగనుంది. తాజాగా పోలీస్ కమిషనర్ల బదిలీల నేపథ్యంలో.. ఏక్షణమైనా కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని సమాచారం. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 17లోగా, లేదా 17న ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కూడా ఈ నెలలోనే పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ప్రచారం ప్రకారం ఈనెల 30న ఎన్నికలు జరిగే అవకాశముం దని, మే 2లోగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసే అవకాశముం దని అంచనాలున్నాయి. ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు, సోమవారం ఖమ్మం జిల్లా నేతలకు దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చినట్లు టాక్. సాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగిసిన వెంటనే ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగే జిల్లాలకు వెళ్లాలని సీఎం సూచించారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పైనే ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల భాద్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టారు. ఇటీవల ఖమ్మంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవం, ఐటీ హబ్ సెకండ్ ఫేజ్ వంటి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొనగా, ఈ పర్యటన విజయవంతమైంది. ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, విజన్‌పై మంత్రి కేటీఆర్ అజయ్‌ను అభినందించారు. ఇక ఖమ్మంలో ఉన్న 60 డివిజన్లకు సంబంధించి ఏ ఎమ్మెల్యేకు ఎక్కడ బాధ్యత అప్పగించాలో.. ఇప్పటికే జాబితా కూడా రెడీ చేసినట్లు సమాచారం. త్వరలో ఈ ఎమ్మెల్యేలు.. ఆ డివిజన్లలో ముందుగా పర్యటించనున్నారు. ఎవరిని ఎక్కడ నియమించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులకు సూచనలు చేసినట్లు సమాచారం. వరంగల్ కార్పోరేషన్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్‌ఛార్జిగా వ్యవహరించనుండగా, ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మె ల్యేలకు తోడు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ నేతలకు స్థానికంగా డివిజన్ల బాధ్య తలు అప్పగించనున్నారు. ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక పరిస్థితులను బట్టి 3నుండి 5 డివిజన్ల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. సాగర్ ప్రచారంలో ఉన్న వరంగల్ ఎమ్మెల్యేలు వెంటనే వరంగల్ కార్పోరేషన్ బాధ్యతల్లోకి వెళ్ళనున్నారు.
విడివిడిగానా..
గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మునిసిపాలిటీలకు త్వరలో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మునిసిపాలిటీల పాలక వర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో తీరనుంది. గ్రామ పంచాయితీల నుంచి మునిసిపాలిటీలుగా హోదా పెరిగిన నకిరేకల్ (నల్గొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)లకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయితీల ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. మునిసిపాలిటీల్లో చేరిపోయాయి. అయితే ముందుగా కార్పోరేషన్లకు నిర్వహించి, తర్వాత ఇతర మునిసిపాలిటీలు, పెండింగ్ పరిషత్‌ల ఎన్నికలు పూర్తిచేయాలని తాజాగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యనేతలకు సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నగర నగారా మోగేందు కు.. రంగం సిద్ధం కావడంతో పార్టీలు, క్షేత్రస్థాయి క్యాడర్ అలర్ట్ అయ్యారు.