సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్ ను హెల్త్ హబ్ గా ప్రకటించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ MGM హాస్పిటల్ లో రూ.2 కోట్ల 14 లక్షల విలువైన కొత్త CT స్కాన్ ను ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. CT స్కాన్ మిషన్ ను పరిశీలించిన మంత్రి, అది పని చేసే విధానం, ఒకరోజులో ఎంత మందికి స్కాన్ చేయవచ్చు ? వంటి విషయాలను అక్కడి సూపరింటెండెంట్, టెక్నీషియన్స్ ను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఆవరణలోని పరిసరాలు ఎలా ఉన్నాయో ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎంజీఎం హాస్పిటల్ గతంలో ఎలా ఉండేది ? ఇప్పుడు ఎలా ఉంది ? ఒకసారి విశ్లేషించాలన్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, మంత్రి హరీష్ రావు పనితనంతో రాష్ట్రం, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు వరంగల్ లో ఏర్పాటు అవుతున్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను పూర్తి ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివన్నారు. అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలు, ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. అందుకే ఎంజిఎంలో అత్యవసర, ఇతర అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ సిటి స్కాన్ ద్వారా అన్ని రకాల స్కానింగ్ లు చేయడం జరుగుతుందన్నారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన ఈ CT ద్వారా, సత్వర చికిత్సకు వీలవుతుందన్నారు. ఎంజీఎం CT ద్వారా అత్యవసర పరీక్షలు సులువవుతాయన్నారు. ఇక ఎంజీఎంలో బయోమెట్రిక్ పద్ధతి అమలు అవుతుందన్నారు. ఎంజీఎం లో ప్రస్తుతం అన్ని రకాల మెరుగైన వసతులు కల్పించామన్నారు. రూ.15 లక్షలతో కొత్త ఎక్స్-రే, రూ.40 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ మెషిన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.12 కోట్లతో MRI మెషిన్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 65 మోకాళ్ల ఆపరేషన్లు, 300 యాంజియోగ్రామ్ లు, క్యాథ్‌లాబ్ కేసులు ఇక్కడ జరిగాయన్నారు. ఎంజీఎంను 1,000 పడకల నుండి 1,300 పడకలకు అప్ గ్రేడ్ చేశామన్నారు. ఐ.సి.యు బెడ్లు 100 ఉండగా 180కి పెంచామన్నారు. వెంటిలేటర్ బెడ్లు 25 నుండి 200 బెడ్లకు పెంచామన్నారు. ఎంజీఎంలో రెండు ఆక్సిజన్ ట్యాంక్ లు, ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అన్ని వార్డులు, కారిడార్లు, దవాఖానా ప్రాంగణాల్లో ప్రతిరోజూ మూడుసార్లు శుభ్రపరచమని అదేశించామన్నారు. పాత శానిటేషన్ ఏజెన్సీని రద్దు చేసి, కొత్త ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతి కార్మికుడికి వేతనాలు రూ.9800/- నుండి రూ.15,500/- లకు పెంచుతున్నామన్నారు. కాంట్రాక్టు పద్దతిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 135కి గాను 80 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగతా పోస్టులను రెండవ దశలో ఎంపిక చేస్తామన్నారు. మరో వైపు PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల ద్వారా సేవలు విస్తృత పరిచి, 1 కోటి రూపాయల విలువ గల స్టంట్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో 11 వందల కోట్లతో 24 అంతస్థుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరలోనే వరంగల్ లో ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలప దాసు చంద్ర శేఖర్, వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement