Friday, November 22, 2024

రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే సీత‌క్క‌

భూపాలపల్లి: రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ములుగు శాసన సభ్యురాలు సీతక్క ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో శుక్రవారం అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి పంటలను భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క, సత్తన్న మాట్లాడుతూ… మండలంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల గురించి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టేకుమట్ల మండలంలో సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్ రావు మిర్చి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అలాగే గుమ్మడవెల్లి గ్రామంలో దళిత రైతు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

రైతులు చనిపోతుంటే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబరాలు చేస్తున్నారని, రైతులు సంతోషంగా లేరన్నారు. అకాల వర్షాలతో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, కష్టపడి వరిపంట పండిస్తే సకాలంలో కొనక, రైతులను తరుగు పేరుతో కోత విధిస్తూ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై, టీఆర్ఎస్ నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వమని, రైతుల రక్తం తాగే ప్రభుత్వమని అన్నారు. వందల ఎకరాలున్న నాయకులకు లక్షల్లో, కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబరాలంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతు సంబరాలు బంద్ చేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులకు ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి, ప్రభుత్వం తరపున మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ శ్రీకాంత్, మాజీ సర్పంచులు పెరుమండ్ల లింగయ్య, రాజమౌళి, కృష్ణారెడ్డి, మండల నాయకులు నారాయణ రావు, బండి రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు, మధుకర్, విగ్నేష్, అనీల్, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రైతులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement