వరంగల్ – ఓరుగల్లు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ 66 డివిజన్లు ఉండగా, గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ గుండు సుధారాణిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది. టికెట్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొనడంతో టీఆర్ఎస్ నుండే 706మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్, వరంగల్ పశ్చిమలో దాస్యం వినయ్ భాస్కర్లు టికెట్ల కేటాయింపులో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరి స్తుండగా, వరంగల్ ఇన్ఛార్జిలుగా పార్టీ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల ను అధిష్టానం పంపింది. వరంగల్, ఖమ్మం పరిస్థితులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికపుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నామినేషన్లు పెద్ద సంఖ్యలో పడ్డా వరంగల్‌లో రెండు మూడురోజుల్లో అంతా సర్దుకుంటుందని అధిష్టానం అంచనా వేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తు న్నారు. ఇక్కడ డబ్బులున్న వారికే టికెట్లు ఇస్తున్నారంటూ అసంతృప్తవాదులు కరపత్రాలు ముద్రించి పంచడం చర్చనీయాంశంగా మారింది.
సిట్టింగ్ లకు మొండి చేయి … కొత్త వారిదే పై చేయి..
ఇది ఇలా ఉంటే …మాజీలకు టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదనే మాట టిఆర్ ఎస్ లో వినిపిస్తున్నది.. అందరూ అనుకున్నట్లుగానే సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చేందుకు అధికార పక్షం అంత సుముఖంగా లేనట్లు సమాచారం. రెండు, మూడు దఫాలుగా నిర్వహించిన సర్వేల్లో తాజా మాజీ కార్పొరేటర్లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వెల్లడి కావడంతో టిఆర్ ఎస్ అధిష్టానం కొత్త వారిపై దృష్టి సారించింది . ఎన్నికల నేపథ్యంలో 90% మంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక భూ వివాదాలలో ఉన్న సిట్టింగ్ లను ఈ ఎన్నికలలో దూరం పెట్టనున్నారు. కాగా, పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురు మాజీలకు , తూర్పులో ఇద్దరు సిట్టింగ్‌లకు టిక్కెట్ల దక్కవచ్చు.. ఇక విలీన గ్రామాలలోని డివిజిన్లలలో అక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కొత్త వారికి అవకాశం ఇస్తాం అని ప్రకటించారు.. అలాగే ఎమ్మెల్యేల వెంటఉన్న ప్రధాన అనుచరులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు .దాదాపు వీరికి టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఈ టిక్కెట్ల పంచాయితీ తేల్చేందుకు నేటి సాయంత్రం ఆశావహులతో వరంగల్ ప్రజాప్రతినిదులు సమావేశం కానున్నారు.. ఈ సమావేశం వాడివేడిగా సాగనుందని సమాచారం…