మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సీరోల్ గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో ఆహారం కల్తీ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో విద్యార్థులెవరికి ఎలాంటి ప్రమాదం లేదని, తగిన వైద్యం అందుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని తెలిపారు. కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే విద్యార్థులను వైద్య పరీక్షలకు పంపించాలని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి ఆదేశాలను అనుసరించి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే సీరోలు ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలకు వైద్య బృందాన్ని పంపించినట్లు పేర్కొన్నారు. కల్తీ ఆహారంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. కల్తీ ఆహారం తిన్న విద్యార్థులను సమీప ఏరియా ఆస్పత్రికి పంపించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెంటనే అక్కడ ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులెవరికీ ప్రమాదం లేదని, వైద్యం అందుతుందని అధికారులు మంత్రి సత్యవతి రాథోడ్ కు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital