ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పాలిటీ పరిధిలో 9, 10 వార్డులల్లో టీయుఎఫ్ ఐడిసి నిధులతో ఫేజ్ – 5 కింద సుమారు రూ.260 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా ఇంచార్జీ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. ముందుగా మహబూబ్ పల్లిలో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వైండనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
గండ్రపల్లిలో రూ.40 లక్షలతో సైడ్ డ్రైనేజీ పనులకు, పుల్లూరు రామయ్యపల్లిలో రూ.35 లక్షలతో ఇంటర్నల్ డ్రైనేజీ పనులకు, రూ.80 లక్షలతో బీటీ రోడ్డు నుండి తుమ్మలకుంట చెరువు కట్ట వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షలతో లారీ అసోసియేషన్ రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గుత్తేదారులు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, కౌన్సిలర్లు, సంబంధిత శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.