Tuesday, November 26, 2024

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

కొత్తగూడ, (ప్రభ న్యూస్ ) : మిర్చి సాగు చేస్తున్న రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన మిర్చి పంటను సర్వే చేసి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ.ఐ.కె.ఎం.ఎస్.జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతుగూడెం తండా, లడాయిగడ్డ, రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాల్లో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎమ్.ఎస్.జిల్లా నేత‌లు గుగులోతు యాదగిరి మాట్లాడుతూ… నెలరోజులుగా మిర్చి సాగుచేసిన రైతుల పంటకు వైరస్ సోకి కాపు వచ్చే దశలో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట రోగాల బారిన పడి అప్పులు మిగిలాయన్నారు. ఇప్పటివరకు దెబ్బతిన్న పంటల వైపు కనీసం ఏ అధికారి, ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడటంలేదని కన్నీరు పెట్టుకుంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పంట‌న‌ష్ట‌పోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ తెగుళ్లను ప్రకృతి విపత్తుగా భావించి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిర్చి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల‌న్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు.జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, భూర్క సూరయ్య, బెల్లి సుధాకర్, సుమన్, లవుడ్య యాకుబ్, అజ్మీర తిరుపతి, లింగంపల్లి సత్యం, గుంజ దుర్గయ్య, బిజ్జ వెంకటలక్ష్మి, రాంధన్, సత్యనారాయణ, నర్సిరెడ్డి, కొమురన్న, ఉప్పలయ్య, ప్రభాకర్, రవీందర్, జామ్లా, రాజు, గట్టి నాగేశ్వరరావు, లక్ష్మన్న, సంజీవరావు, తదితర రైతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement