ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద నీటితో మంగపేట వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. మంగళవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం బుదవారం ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కాళేశ్వరం, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాలోని పలు గోదావరి తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది.
దీంతో గోదావరిలో ఇప్పటికే 9వేల క్యూసెక్కుల వరద దిగువనున్న గోదావరి నదిలోకి కలిసి ప్రవహిస్తుండడంతో గోదావరి వద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. వరద పరిస్థితి కొనసాగితే గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండల వ్యాప్తంగా 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.