Tuesday, November 26, 2024

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆద‌ర్శం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హ‌న్మ‌కొండ : పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూర్, దామెర మండలాలకు చెందిన 110 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు గాను రూ.1కోటి 10లక్షల 12వేల విలువైన చెక్కులను పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మన అదృష్టం అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవ‌ని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనతికాలంలో గ్రామాలలో,పట్టణాలలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత కేసీఆర్ దే అన్నారు.

ప్రపంచ దేశాలు మన తెలంగాణ వైపు చూసేలా అనతికాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గోదావరి నీరందించిన అపరభగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటు, రెండు పంటలకు పెట్టుబడి, రైతు బంధు, రైతుబీమా, రైతు బంధు సమీతీలతో వారికి అండగా నిలిచిన ఘనత తెరాస ప్రభుత్వానిద‌న్నారు. అధిచేస్తాం… ఇదిచేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచేసిందో చెప్పాలన్నారు. రావాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. దేశానికే తలమాణికంగా మన నియోజకవర్గంలో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ప్రారంభించుకోబుతున్నాం. ఇందులో పరిశ్రమల ఏర్పాటు వల్ల నియోజకవర్గంలోని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,మండల & గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement