Tuesday, November 19, 2024

అటకెక్కిన 1/70 చట్టం : బడాబాబుల చేతుల్లో బందీ అవుతున్న ఏజెన్సీ చట్టాలు

వాజేడు : అధికార పార్టీ అండదండలు ఉంటే ఏదైనా చేయొచ్చు ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి గిరిజనేతరుల బహుళ అంతస్తుల నిర్మాణం అడ్డూ అదుపు లేకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 1/70చట్టాన్ని అటకెక్కించి అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు నోరుమెదపని కథనమిది…..?
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చెరుకూరు గ్రామం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. 163 జాతీయ రహదారి నిర్మాణం జరగడంతో ఆ గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా అక్కడ పాగా వేస్తూ అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టరాదని నిబంధనలున్నప్పటికీ ఏజెన్సీ చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

చెరుకూరు గ్రామంలో జాతీయ రహదారికి ఇరువైపుల అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఏజెన్సీ చట్టాలను కాపాడాల్సిన అధికారులు ముడుపుల మత్తులో పడి చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో 1/70 చట్టం అటకెక్కి దర్శనమిస్తుంది. అధికార పార్టీ నేతలు కావడం అధికారుల అండదండలు తోడవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. చెరుకూరు అడ్డాగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని గిరిజన సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతర బడా బాబుల హవా కొనసాగుతుంది. చెరుకూరు గ్రామంతో పాటు వాజేడు చండ్రుపట్ల పేరూరు ధర్మవరం తదితర గ్రామాల్లో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతుంది. పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ కట్టడాలపై కేసులు పెట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు అడ్రస్ లేకపోవడంతో ఏజెన్సీ చట్టాలు గిరిజనేతర బడాబాబుల చేతిలో బందీ అవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమకట్టడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement