జనగామ, జూలై 6 ప్రభ న్యూస్ : ఇటీవల జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్ మర్డర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సీపీ రంగనాథ్ నేతృత్వంలో ఈ కిడ్నాప్ మర్డర్ కేసు పై విచారణలో.. ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య సమాచారంతోనే గతంలో సుభద్రను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో రిటైర్డ్ ఎంపీడీవో హత్యతో తీగ లాగితే డొంక కదిలింది.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్క వానిగూడెం శివారులోని సదాశివపేటలో గతేడాది అక్టోబరులో హత్యకు గురైన గంగరబోయిన సుభద్ర మృతదేహానికి గురువారం రీపోస్టుమార్టం నిర్వహించారు. సుభద్ర హత్య కేసులో నిందితుడైన జడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త గిరబోయిన అంజయ్య, సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు సుభద్ర మృతదేహానికి కాకతీయ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, నిపుణులు రీపోస్టుమార్టం చేశారు.
గతంలో సుభద్ర మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నెల రోజుల తర్వాత వారు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని నివేదిక ఇచ్చారు. ఇటీవల బచ్చన్నపేట విశ్రాంత ఎంపీడీవో రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడైన గిరబోయిన అంజయ్య.. సుభద్రను తానే హత్య చేయించినట్లు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు సుభద్ర మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేశారు. మరోమారు సుభద్ర రీ పోస్టుమార్టంలో ముఖ్యంగా ఐ హార్డ్ బోన్ కీలకంగా మారబోతుందా.. దీనిపై నిజానిజాలు ఫోరెన్సిక్ బృందం నిగ్గు తెలుస్తుందా.. లేక గతంలో పోస్టుమార్టం రిపోర్ట్ మాదిరిగానే రిపోర్ట్ ఇస్తుందా అనే దానిపై వేచి చూడవలసిందే.