మరిపెడ : జిల్లాలో అక్రమ వ్యాపారాలకు తావులేదని, నిషేధిత పదార్థాలు రవాణ చేసినా, క్రయ విక్రయాలు జరిపినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీయాక్టులు కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మరిపెడ మండలంలో పోలీసులకు పట్టుబడిన నల్లబెల్లం, పటిక కు సంబంధించిన వివరాలను శుక్రవారం తొర్రుర్ పోలీస్ స్టేషన్‌లో వెళ్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 14 తేదీన మరిపెడ మండల కేంద్రంలోని రాజీవ్ సెంటర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్26టీ4416 నంబరు గల ట్రాలీని ఆపి తనిఖీ చేయగా అందులో 110 బస్తాల్లో నిషేధిత నల్లబెల్లం సుమారు 55క్వింటాలు, 6బస్తాల పటిక, అదే విధంగా మండల పరిధిలోని కుడ్యతండా శివారులో కేఏ 07బీ3358 నంబరు గల ట్రాలీ తనిఖీ చేయగ 4క్వింటాళ్ల నిషేధిత నల్లబెల్లం, 2బస్తాల పటిక రవాణ చేస్తున్నట్లు గుర్తించటం జరిగింది. మొత్తం 59 కింటాళ్ల నల్లబెల్లం, 4కింటాల పటిక విలువ సుమారు రూ.5.90లక్షలుగా ఉంటుందన్నారు. వీటికి సంబంధించి 12మందిపై కేసు నమోదు చేయగా.. ముగ్గురు అదుపులో ఉన్నారని, తొమ్మిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో మరిపెడ మండలం బాల్యతండాకు చెందిన బానోత్ సంతోష్, గాలివారి గూడెం గ్రామానికి చెందిన టిలావత్ రమేష్, నర్సింహులపేట మండలం బానోత్ సలీం ఉండగా పరారీలో వీరారం గ్రామానికి చెందిన దారవత్ రాందాస్, బాల్యతండాకు చెందిన జర్పుల నెహ్రూ, వెంకట్యతండాకు చెందిన గుగులోత్ రత్న కుమార్, పర్కజాల్ తండాకు చెందిన బానోత్ కిషోర్, గూడూరు మండలం పొనుగోడుకు చెందిన చిట్టిబాబు (బానోత్ కృష్ణ), చిన్నగూడూరు మండలం బావోజి తండాకు చెందిన ధరంసోత్ వీరేష్, నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన గుగులోత్ వీరన్న, ఆంధ్రప్రదేశ్ రాష్టం చిత్తూర్ జిల్లా మదనపల్లికి చెందిన బోగం రాజు, అదే మదనపల్లికి చెందిన బోగం శ్రీనివాస్ ఉన్నారని, త్వరలోనే అందరిని అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మరిపెడ పరిధిలో అక్రమ నల్లబెల్లం రవాణపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ ప్రవీన్ కుమార్, సిబ్బంది క్రాంతి కుమార్, స్టేషన్ డ్రైవర్ సందీప్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యోగేష్, తొర్రుర్ డీఎస్పీ వెంకటరమణ రెడ్డి, మరిపెడ సీఐ ఎన్ సాగర్, తొర్రుర్ సీఐ సత్యనారాయణ, తొర్రుర్ ఎస్ఐ గుండ్రాతి సతీష్, తదితరులు పాల్గొన్నారు.