Saturday, November 23, 2024

బ్లాక్ దందాకు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు : ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్‌

మ‌రిపెడ : జిల్లా ప‌రిధిలో బ్లాక్ దందాల‌పై ప‌టిష్ట నిఘా ఉంచామ‌ని, ఎవ‌రైనా అక్ర‌మ వ్యాపారాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ప‌లు మార్లు ప‌ట్టుబ‌డినా తీరు మార‌ని నిందితుల‌పై పీడీయాక్ట్ ప్ర‌యోగిస్తామ‌ని మానుకోట ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చ‌రించారు. తొరూర్ సబ్ డివిజన్ పరిధిలోని మ‌రిపెడ‌, తొర్రుర్, పెద్ద‌వంగ‌ర పీఎస్‌ల ప‌రిధిలో గ‌డ‌చిన వారం రోజుల్లో వేర్వేరుగా ప‌ట్టుబ‌డిన 25 టన్నుల నల్లబెల్లం, 5 క్వింటాళ పటిక, 30 లీటర్ల గుడుంబా, 4.08 టన్నుల పీడీఎస్ బియ్యానికి సంబంధించిన వివ‌రాల‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న మ‌రిపెడ పోలీస్‌స్టేష‌న్‌లో తొర్రుర్ డీఎస్సీ ఏ.ర‌ఘుతో క‌లిసి విలేక‌రుల‌కు వెల్ల‌డించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు మ‌రిపెడ పోలీసులు, జిల్లా టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా మ‌రిపెడ మండ‌లంలోని తాళ్ల ఊక‌ల్ ప‌ర‌ధిలోని రూప్‌సింగ్ తండా వ‌ద్ద త‌నిఖీలు చేయ‌గా ఓ లారీలో 12.5కింటాళ్ల (250 బ‌స్తాలు) న‌ల్ల‌బెల్లం, 5 కింటాళ్ల‌(10 బస్తాలు) పటిక, 30 లీటర్ల గుడుండా స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ప‌ట్టుబ‌డిన మొత్తం నిషేధిత ప‌దార్థాల విలువ సుమారు రూ.13.06ల‌క్ష‌లు ఉంటుంద‌ని, లారీని సీజ్ చేసి న‌లుగురిపై కేసు నమోదు చేసిన‌ట్లు తెలిపారు. మ‌రిపెడ మండ‌లం చింత‌ల‌గ‌డ్డ తండాకు చెందిన గుగులోత్ వీర‌న్న‌, ఖ‌మ్మం జిల్లా కేంద్రానికి చెందిన చ‌ల్లా ఉపేంద‌ర్‌, గుడిమ‌ళ్ల గ్రామానికి చెందిన త‌మ్మిశెట్టి రామ‌రాజు, మంగ‌ళ‌గూడెం గ్రామానికి చెందిన చ‌ట్టా నాగ‌రాజు అనే న‌లుగురు క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్టం చిత్తూర్ జిల్లా నుంచి ఈ న‌ల్ల‌బెల్లం, ప‌టిక‌ను ఖ‌మ్మం మీదుగా త‌ర‌లిస్తూ మరిపెడ‌లో ప‌లు తండాల్లో విక్ర‌యిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అదే విధంగా తొర్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారంతో తొర్రుర్ పోలీసులు సోమారం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఓ ఆటోలో సుమారు 10 కింటాల పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండగా తొర్రుర్ ఎస్ఐ పట్టుకొని స్వాధీనం చేసుకోవ‌టం జ‌రిగింద‌ని, వీటి విలువ సుమారు రూ.10వేలు ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో చౌడురు మండ‌లం సోమారం గ్రామానికి చెందిన పానుగోటి మ‌నోహ‌ర్‌పై కేసు న‌మోదు చేసి ఆటో సీజ్ చేశామ‌న్నారు. అదే విధంగా పెద్దవంగ‌ర పీఎస్ ప‌రిధిలోని చిట్యాల గ్రామంలో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఓ ట్రాలీలో అక్ర‌మంగా త‌రలిస్తున్న 30కింటాళ్ల పీడీఎస్ బియ్యం ప‌ట్టుకుని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ. 51వేలు ఉంటుంద‌ని, ఈ కేసులో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజ‌పేట మండ‌లం పుట్ట‌గూడెం గ్రామానికి చెందిన మాలోత్ సియా, అమ‌ర్ సింగ్ తండాకు చెందిన జాటోత్ బిచ్చ‌, చిట్యాల గ్రామానికి చెందిన వ‌లి పాషాల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. అక్ర‌మ ర‌వాణ‌ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రామారావు, మ‌రిపెడ సీఐ ఎన్. సాగ‌ర్‌, తొర్రుర్ సీఐ స‌త్య‌నారాయ‌ణ‌, మ‌రిపెడ ఎస్ఐ దూలం ప‌వ‌న్ కుమార్‌, సంతోష్‌, పెద్ద‌వంగ‌ర ఎస్ఐ రియాజ్ పాషా, సిబ్బందిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement