Monday, November 25, 2024

త్వరలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు : కేసీఆర్

వరంగల్ : త్వరలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్​లో నిర్మించిన ఆసుపత్రి, వైద్య కళాశాలను ప్రారంభించిన ఆయన ఈ ఆసుపత్రితో వరంగల్ ప్రజలకు శుభాపరిమాణం అని వెల్లడించారు. తాను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఇంక ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో ఉన్న దామెర క్రాస్ రోడ్డు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 350 పడకలతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను సీఎం ప్రారంభించారు. కళాశాల ప్రారంభించడం వల్ల అందుబాటులోకి మరో 150 ఎంబీబీఎస్​ సీట్లు వచ్చాయని వెల్లడించారు. ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించడం వరంగల్​ ప్రజలకు శుభపరిణామంగా చెప్పవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు మాత్రమే ఉన్న ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 33జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, ఎంబీబీఎస్​ సీట్లను 6500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రాజకీయాల్లో భాగంగా కేంద్రమంత్రులు ఇక్కడకు వస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మళ్లీ ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న అజాగ్రత్త వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు. అలాగే 1956లో జరిగిన పొరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయామని సీఎం అన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు.

భారత్​ ప్రపంచ దేశాలతో వెనుకబడి ఉంది :
ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. దేశవ్యాప్తంగా 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అద్భుతమైన వ్యవసాయ అనుకూల వాతావరణం దేశానికే సొంతమని సీఎం అన్నారు. అత్యధిక పంటలు పండిస్తున్నా… విదేశీ ఆహార పదార్థాల మీద ఆధారపడుతున్నామన్నారు. అద్భుతంగా పనిచేసే యువశక్తి ఉన్నా… ప్రపంచ దేశాల్లో వెనుకబడి ఉన్నామని ప్రస్తావించారు. భారతదేశం గొప్ప సహనశీల దేశమన్న ఆయన, అందరినీ కలుపుకొని పోయే దేశంలో విద్వేషాలు రగిలించవద్దని హెచ్చరించారు. విద్వేష రాజకీయాలు యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలన్నారు. మన పురోగమనం అనుకున్నట్లు సాగాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఇంక ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు మాత్రమే ఉన్న ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement