Friday, November 22, 2024

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి : పార్థసారథి

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ లతో ఏర్పాట్లపై సమీక్ష.
పాల్గొన్న సిపి తరుణ్ జోషి, కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
వ‌రంగ‌ల్ – మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించుటకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ లతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి సమర్ధంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో మాస్క్ ధరించి వస్తేనే అనుమతించాలని, మాస్క్, సానిటైజర్, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ప్రక్రియ పై పూర్తి స్ధాయి దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, పోలీస్ ఎస్పీ, మున్సిపల్ కమీషనర్లు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియపై ప్రతి స్టేజిలోను క్లోజ్ లైజన్ కలిగి ఉండాలన్నారు.
మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల సిబ్భంది నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ లు, పేపర్ల సేకరణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు,
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోవిడ్ నిబంధనల ప్రకారం పక్కాగా ప్రణాళికాబద్ధంగా జరగాలని చెప్పారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుటకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పోలీస్ బందోబస్తు, సిసి కెమెరా, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియ పూర్తిగా రికార్డ్ చేయాలని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండ స్వేచ్ఛ తో స్వచ్చందంగా ఓటు హక్కు వినియోగించుటకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు, దివ్యంగులకు , వృద్దులకు వీల్ చైర్ లతో పాటు వాలంటీర్ లను, తాగునీరు, నీడ కల్పించాలని తెలిపారు. పోలింగ్ కు ముందు బ్యాలెట్ బాక్స్ లు,పోలింగ్ సామగ్రి, తగినంత పోలింగ్, పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలిస్ బందోబస్తు ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరుగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, ఎస్ ఎస్ టి ల ద్వారా గట్టి నిఘా ఉంచాలని అన్నారు. సామాజిక వ్యతిరేకులు, రౌడీషీటర్ లను బైండ్ఓవర్ చేయాలని అన్నారు. ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీల నిర్వాహకులు, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రచారం పోలింగ్ కు 72 గంటల ముందు అనగా ఈ నెల 27 న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్ ఐ టి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది అందరికి మాస్క్ లు, చేతి గ్లోవ్స్, సాని టైజర్ లు అందిస్తున్నామని , ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్ ను ఉంచుతున్నట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద మాస్క్ లు, సాని టైజర్ లు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. కోవిడ్ బాధితులు, 80 ఏండ్ల వయస్సు వారు పోస్టల్ బాలట్ వినియోగించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఫోటో ఓటర్ల స్లిప్ ల పంపిణీ జరుగుతున్నదని ఈ నెల 27 లోగా పూర్తి చేస్తామని తెలిపారు. 167 సమస్యాత్మక, 203 సున్నితమైన, 159 హైపర్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు గుర్తించి పటిష్ట బందోబస్తు, మొత్తం పోలింగ్ ప్రక్రియ రికార్డ్ చేస్తున్నామని అన్నారు. 898 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు 1221 బ్యాలెట్ బాక్స్ లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరుగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, ఎస్ ఎస్ టి ల ద్వారా నిరంతరం గట్టి నిఘా జరిపి సైజ్ చేస్తున్నామని అన్నారు. సామాజిక వ్యతిరేకులు, రౌడీషీటర్ లను బైండ్ఓవర్ చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 పోలీస్ లను నియమిస్తున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి, డిసిపి పుష్ప, ఆదనపు కమిషనర్ నాగేశ్వర్, డి ఎస్ పి జనార్దన్ , బల్దియా , పోలీస్ , రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement