Tuesday, November 26, 2024

జీడికల్ దేవాలయ అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

జనగామ : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని జీడికల్ శ్రీ వీరాచల జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనదని వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకుపోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన జీడికల్ దేవాలయానికి ఆర్టికల్ నిర్మాణం, దేవాలయ రోడ్డు అభివృద్ధికి నాలుగు కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆయా పనులకు ఆదివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలసి శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు దేవాలయ పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈసందర్బంగా వీరాచల శ్రీ సీతారమచంద్రస్వామిని ఎమ్మెల్సీ పోచంపల్లి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ఏడాది మే9వ తేదీన ఎమ్మెల్యే కోరిక మేరకు జీడిపల్లి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులతో ఇక్కడికి రావడం నా అదృష్టమన్నారు. 200 ఏళ్ల నుంచి ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. సీఎం కేసీఆర్ వచ్చాకే దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నారని కొనియాడారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను సైతం అభివృద్ధి చేస్తున్నారని,పూజారులను ఆదుకున్నారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట అత్యంత వైభవంగా తయారైంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో జీడి కల్ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

  • రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం..
    సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జీడికల్ గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తా. ఈ దేవాలయ భూములపై సర్వే చేపట్టాం. అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాం. యాదాద్రికి ఎలా పేరు వచ్చిందో ఈ జీడికల్ కు అలా రావాలని తెలంగాణలో ఈ పేరు మార్మోగాలన్నారు.అన్ని ప్రాంతాల నుంచి వచ్చేలా, జాతర జరిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. 44 ఎకరాల్లో దేవాలయం, కళ్యాణ మంటపం, పార్కు, పార్కింగ్ ప్రదేశాలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన.. మూడేళ్లలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. దశలవారీగా నిధులు సమకూర్చి 50 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తాం. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. డబుల్ రోడ్డు కూడా మంజూరు చేయించేలా కృషి చేస్తాను. సీసీ రోడ్లు కూడా చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు..ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి, లింగాల ఘనపూర్ జడ్పీటిసి గుడి వంశీధర్ రెడ్డి, ఎంపిపి చిట్ల జయశ్రీ, సర్పంచ్, ఆలయ ఛైర్మెన్, ఈవో తదితరులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement