Tuesday, November 26, 2024

రేవంత్ తెలంగాణ ద్రోహి : మంత్రి ఎర్ర‌బెల్లి

రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని రాష్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం ముస్త్యాల పల్లి జంక్షన్ లో తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ విగ్రహాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ఆవిష్కరించారు. అలాగే, కోటి 98 లక్షల “కుడా” నిధులతో జంక్షన్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. రూ.14 కోట్ల 59 లక్షల రోడ్లు భవనాల నిధులతో దుర్గంపేట నుండి అక్కంపేట వరకు రోడ్డు విస్తరణకు ప్రారంభోత్సవం చేశారు. రూ.15 కోట్ల రోడ్లు భవనాల నిధులతో ఒగ్లాపూర్ నుండి ధర్మారం వరకు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మండలం లింగమడుగు పల్లెలో గ్రామీణ క్రీడా ప్రాంగణంను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే వాలీబాల్ అడారు.

అనంతరం గ్రామంలో జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… జయశంకర్ సార్ త‌మ‌ తండ్రి కి క్లాస్ మేట్, త‌న‌కు గురువు అన్నారు. ఆయన ఇంట్లో ఉండి తాను చదువుకున్నానన్నారు. ఉద్యమంలో టీడీపీతో తెలంగాణకు అనుకూలంగా ఉత్తరం ఇప్పించిన త‌నకు సారే అలా చేయమని చెప్పాడన్నారు. చివరి శ్వాస వరకు జయశంకర్ సార్, తెలంగాణ కోసం పోరాటం చేసిండన్నారు. పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ కు భయపడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని.. కాంగ్రెస్ ఊరికే ఇవ్వలేదన్నారు. మీరు తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి సిగ్గు లేదు, దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు బుద్ధి లేదన్నారు. సీఎం కేసీఆర్ నెహ్రూ అయితే, జయశంకర్ సార్ గాంధీ అన్నారు. తెలంగాణను సాధించడానికి దారులు వేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ ఈ గ్రామానికి చెందిన వారు కావడం గర్వకారణమ‌న్నారు. జయ శంకర్ ఆశయాల మేరకు సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు. వాళ్లు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవ్వాళ మనం ఇంత స్వేచ్ఛ గా, స్వతంత్రంగా బతికే వాళ్ళమా ? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా ? తెలంగాణను విమర్శించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన దానితోనే చెప్పండన్నారు. బాబ్లీపై పోరాటం చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ? అని ప్ర‌శ్నించాడు. కాళ్ళ సందుల్లోంచి తప్పించుకొని పారిపోయాడన్నారు. ఉద్యమంలో లేనోడు… ఇవ్వాళ ఏదో ఊడ బెరుకుతానని వస్తున్నాడన్నారు. ఆయనకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత ప్రజలదేన‌న్నారు. రేవంత్ నీకు జయశంకర్ సార్ తెలుసా ? ఎప్పుడైనా చూశావా ? ఆయన చిత్రపటానికి పూల‌మాలలు వేశావా ? ఆయనను ఎప్పుడైనా స్మరించుకున్నావా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ మోసపు పార్టీ.. బీజేపీ జూటా పార్టీ అన్నారు.

- Advertisement -

జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజు మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీ చేసేది లేదు.. చెప్పేది లేదన్నారు. డబ్బులు పెట్టీ పదవులు తెచ్చుకున్న కొందరు, ఢిల్లీ పార్టీ వాళ్ళు గల్లిల్లోకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి మాట్లాడుతూ…విమర్శించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలదేన‌న్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇప్పుడు రా.. నీకు దమ్ముంటే, మళ్ళీ రా నిన్ను తరిమికొట్టడం ఖాయమ‌న్నారు. రేవంత్ రెడ్డికి ఏమి కావాలో అడుక్కొని పోకుండా.. అభాండాలు వేస్తూ, అబద్ధాలు చెబితే ఎవరూ ఊరుకోరని ఆయన తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, “కుడా” చైర్మన్ సుందర్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement