వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) టూ వీలర్ పై ప్రయాణం చేస్తూ ఓ వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి పోయాడు.అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు క్షణం కూడ ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా నగర పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ ఇప్పించారు. అది నగరప్రజల పాలిటవరంలా మారింది. ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసులు సీపీఆర్ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా వరంగల్ హనుమకొండలో జరిగిన ఈ సంఘటన. హన్మకొండకు చెందినరేషన్ డీలర్ రాజు బైక్పై వెళ్తూ అలంకార్ జంక్షన్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్ చేసాడు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. . దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు.సీపీఆర్ ద్వారా రేషన్ డీలర్ రాజు ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామిని వరంగల్ పోలీస్ కమిషనర్ఏవి రంగనాథ్ అభినందించారు.సీపీఆర్ పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ రంగనాథ్ అవగాహన కల్పిస్తూ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ రవి కుమార్ లు సైతం ట్రాఫిక్ కానిస్టేబులు చూపిన చొరవను అభినందించారు. నిండు ప్రాణం కాపాడి పోలీసుల ప్రతిష్టను పెంపొందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చొరవను చూపి సీపీఆర్ శిక్షణ ఇప్పించడం వల్లే నిండు ప్రాణాన్ని నిలుప గలిగడాని గుర్తు చేశారు.