Monday, July 1, 2024

WGL: పశు వైద్యం కోసం పడిగాపులు.. మూతబడి ఉంటున్న పశు వైద్యశాల

వాజేడు, జూన్ 29(ప్రభ న్యూస్): ములుగు జిల్లా వాజేడు మండల రైతులకు పశు వైద్యం అందని ద్రాక్షలా మారింది. పశు వైద్యం కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాజేడు మండలంలో వాజేడు పెద్ద గొల్లగూడెం పేరూరు గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పశు వైద్య అధికారి లేకపోవడంతో పశువులకు వైద్యం అందించే నాధుడు కరువయ్యాడు. పశు వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ సకాలంలో వైద్యశాల తెరిచి వైద్యం అందించకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు.

ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మందులు సరఫరా చేస్తున్నప్పటికీ ఇక్కడి పశు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాజేడు పశు వైద్యశాల ఎప్పుడు చూసినా మూతపడి ఉంటుందని రైతులు వాపోతున్నారు. శనివారం ఉదయం వాజేడు గ్రామానికి చెందిన ఓ రైతు తమ పశువుకు గాయం కావడంతో ఉదయం 8 గంటలకు వైద్యశాలకు వచ్చి 11 గంటల వరకు ఎదురుచూసి పడిగాపులు గాసినా వైద్యం అందించే వారు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగి ఇంటికి వెళుతున్నట్లు వాపోయారు.

ఇలాంటి పరిస్థితి ఎంతోమంది రైతులకు ఎదురవుతుందని వాజేడు మండల రైతాంగం వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడి అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పశువులకు పశు వైద్యం అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement