మరిపెడ : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కనబడక ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాయని, రాష్ట ప్రజల కంటి చూపుకోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతిపక్షాలు కంటి పరీక్షలు చేసుకుని జరిగిన అభివృద్దిని చూడాలని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి పక్షాలకు విమర్శనాస్త్రాలు సందించారు. ఈరోజు ఆమె మానుకోట నుంచి మిర్యాలగూడకు వెళ్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని భారాసా జిల్లా నాయకులు అర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన తేనిటీ విందుకు హాజరై వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో ప్రతి పక్షాలు, ప్రధానంగా బీజేపీకి భయం మొదలైందన్నారు. ధరల పెరుగుదలతో, కార్పొరేట్ చట్టాలతో అస్తవ్యస్తమవుతున్న దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తనదైన మార్క్ వేయనున్నారని ఆమె స్ఫష్టం చేశారు. కేసీఆర్‌ను చూసి నవ్వటం కాదు ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం కేసీఆర్ విజన్ నచ్చి మెచ్చి దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ఖమ్మం సభకు ఒక్కటిగా హాజరయ్యారన్నారు. ఇవేవి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడాలని నాం కే వాస్తే అన్న విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడగొట్టేందుకు దేశ రాజకీయాల్లో దిగుతున్నారనటం ఒకందుకు కేసీఆర్ ఇమేజ్ అంతకంతకు పెంచటమేనని, కర్ణాటక రాజకీయాల్లో కూడా కేసీఆర్ విజయం సాధించే సత్తా ఉన్న నాయకుడని చెప్పకనే చెప్పారన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ మోటో వివరిస్తామని, తెలంగాణ పథకాలు సంక్షేమాలు దేశంలో అమలయ్యే విధంగా రైతులను రాజు చేసే దిశగా కేసీఆర్ అడుగులు ఉంటాయన్నారు.
ఇక మరిపెడ బారాసా నాయకుడు, మైనార్టీ నాయకుడు షేక్ అఫ్జల్ వినతి మేరకు వీరభద్రం రైస్ మిల్లు నుంచి ఆర్జేఆర్ఎం మీదుగా మైనార్టీ కాలనీ వరకు సీసీ రోడ్డు ప్రపోజల్స్‌కు సంబంధించి ఖర్చులను మునిసిపాలిటీకి మంజూరైన రూ.25కోట్లలో చేర్చాలని మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి ఫోన్లో ఆదేశించారు. నిధులకు సంబంధించి వెసులుబాటు లేని పక్షంలో తన సొంత నిధుల నుంచి సదరు రోడ్డుకి నిధులు కేటాయిస్తానని మైనార్టీ నాయకుడికి ఆమె మాటిచ్చారు. అదే విధంగా కురవి వద్ద గ్రానైట్ లారీ కింద పడి మృతిచెందిన చిన్న గూడూర్ మండలం మంగోరి గూడెం గ్రామ మృతుల కుటుంబాలకు గ్రానైట్ క్వారి నుంచి ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.2లక్షలు నష్టపరిహారం అందేలా చేశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి చనిపోయిన కుటుంబాలకు రూ.25వేలు, గాయపడ్డ వారికి రూ.15వేలు అందించామన్నారు. తన సొంతంగా రూ.10వేల చొప్పున బాధితులకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారాసా జిల్లా నాయకులు కొంపెల్లి శ్రీనివాస రెడ్డి, శ్రీరామ్ నాయక్, మాజీ సర్పంచ్ రాంలాల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, భారాసా నాయకలు షేక్ అఫ్జల్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో, ఇన్‌చార్జి డీపీవో కేలోత్ ధన్ సింగ్, మరిపెడ మండల నాయకులు శ్రావణ్ రెడ్డి, తదితరులున్నారు.