మరిపెడ : పుట్టిన గడ్డకు పిడికెడు సాయం కూడా చేయని నీవు.. గిరిజనులకు వీసమెత్తు సాయం కూడా చేయని నీవు, ఏనాడు లంబాడి గోడు పట్టించుకోని నీవు నాయకుడివి ఎలా అవుతావు అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తెరాస మాజీ ఢిల్లీ అధికార ప్రతినిధి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై తేజావత్ రాంచంద్రు నాయక్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా రాంచంద్రు పనితనంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ఒక్క పని కూడా చేయని రాంచంద్రునాయక్ గిరిజన వాదం అంటూ నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించి పదవి హోదా కల్పించినా.. అతని స్వార్థం చూసుకుని ప్రజలను పట్టించుకోని అసమర్థుడని, అందుకోసమే పార్టీ అతన్ని దూరం పెట్టిందని స్పష్టం చేశారు. తనని దూరం చేశారన్న స్వార్థంతోనే రాంచంద్రుడు తెరాస ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. తాను ఎన్ని ప్రచారాలు చేసినా మహబూబాబాద్ జిల్లా ప్రజలు పట్టించుకోరని, కురవి మండల ప్రజలు ఆయన్ని ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా చేశారు. తనకు తానుగా గొప్ప నాయకుడు అనుకొని రాంచంద్రు రాజీనామా చేశాడని, ప్రజలు కనీసం అతన్ని గుర్తించరని, అతడు కేవలం ఓ రిటైర్డ్ ఉద్యోగి మాత్రమే అని హాట్ కామెంట్స్ చేశారు.