ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కాబోతున్నాయి. వరంగల్ ట్రైసిటీలో ఆగస్టు 15 తరువాత నుంచి హెల్మెట్ లేకుంటే ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ ఇవ్వద్దు అని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. దీనికి సంబంధించిన నిబంధనలు పాటించాలని పెట్రోల్ బంకు యజమానులకు/ బంకు అటెండర్‌లకు పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ పెట్టుకోక చాలా మంది ప్రమాదాలకు గురైతున్నారు., ఈ కారణంగా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఇప్పటికే ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ అనే ఫ్లెక్సీలు/బ్యానర్‌లను పంపిణీ చేశారు.
ఐఓసీ, హెచ్‌పీ, బీపీసీఎల్ తదితర పెట్రోల్ బంకులకు ఇప్పటికే 150 బ్యానర్లు పంపిణీ చేశామని ట్రాఫిక్ ఏసీపీ మధుస్ధన్ తెలిపారు. నవంబర్ 1, 2021 నుండి పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను పోలీసులు ఇప్పటికే అమలు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.